మీ బాబు/ పాప గురక మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా ??
మీ బిడ్డకు రాత్రులు నిద్ర పట్టడం కష్టంగా ఉందా? మీ బిడ్డ గురక పెడుతుందా?
గురక సమస్యలు మరియు దగ్గు కోసం అనేక సార్లు యాంటీబయాటిక్స్ వాడుతున్నారా??
చలికాలం మరియు వర్షాకాలంలో సమస్య తీవ్రంగా ఉందా?? నెబ్యులైజేషన్‌ను తరచుగా ఉపయోగిస్తున్నారా? ఐతే…
అది ఆస్తమా కావచ్చు!
యాంటీబయాటిక్స్ మరియు నెబ్యులైజేషన్ ఆస్తమాకు పరిష్కారం కాదు. యాంటీబయాటిక్స్ తరచుగా ఉపయోగించడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. తరచుగా నెబ్యులైజేషన్ ఉపయోగించడం పరిష్కారం కాదు.
ఉబ్బసం/ ఆస్తమా సాధారణంగా అలెర్జీలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది రైనైటిస్, సైనసైటిస్, టాన్సిల్స్, అడెనాయిడ్ లాంటి వ్యాధులకు దారితీస్తుంది.
వ్యాధి తీవ్రత ను బట్టి పిల్లల పెరుగుదల ప్రభావితం కావచ్చు.
పిల్లలందరూ స్వయంగా అలెర్జీని అధిగమించకపోవచ్చు. చాలా మందికి సరైన చికిత్స అందడం లేదు.
ఆస్తమా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో శ్వాసనాళాల వాపు మరియు సంకోచం ద్వారా శ్వాస సమస్యలు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా, దాదాపు 30-35% మంది పిల్లలు అలెర్జీ రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ అనారోగ్యాల ప్రాబల్యం పెరుగుతోంది. అటోపిక్ చర్మశోథ, అలెర్జీ రైనటిస్, ఉబ్బసం మరియు ఫుడ్అలెర్జీలు ఈ రుగ్మతల్లో కొన్ని ….వీటిలో పిల్లలు మరియు పెద్దలలో ఆస్తమా అనేది చాలా సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధి . ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల మంది ప్రజలు ఉబ్బసం వ్యాధి తో బాధపడుతున్నారు. 2025 నాటికి మరో 100 మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.భారతదేశంలో 34 మిలియన్లకు పైగా ప్రజలు ఉబ్బసం వ్యాధి కలిగి ఉన్నారు, మరియు ఇది ప్రపంచ జనాభాలో కేవలం 13 శాతం మంది మాత్రమే అయినప్పటికీ,ప్రపంచ ఆస్తమా మరణాలలో 42 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి.
ఆస్తమా లక్షణాలు
ఆస్తమా లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొందరు తరచుగా ఆస్తమా లక్షణాలు కలిగి ఉండవచ్చు, కొందరు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే లక్షణాలను కలిగి ఉండవచ్చు.
శ్వాస ఆడకపోవుట,
ఛాతీ బిగుతు లేదా నొప్పి,
ఊపిరి పీల్చుకున్నప్పుడు గురక, (ఇది పిల్లలలో ఉబ్బసం యొక్క సాధారణ సంకేతం)
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వలన నిద్ర లేకపోవడం,
జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ వైరస్ ద్వారా తీవ్రతరం అయ్యే దగ్గు .
ఆస్తమా రావడానికి గల కారణాలు
ఈ ఆస్తమా వ్యాధి రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా:
వంశపారంపర్యం,
వాతావరణ కాలుష్యం,
దీర్ఘకాలిక జలుబు,
సైనస్ ఇన్ఫెక్షన్స్,
దుమ్ము, ధూళి, బూజు, పెంపుడు జంతువుల వెంట్రుకలు,
ఆహార పదార్థాలలోని రసాయనాల వంటి వల్ల ఈ ఆస్తమా వస్తుంది.
చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ.
తల్లిదండ్రులు ఆస్తమా బాధితులు అయితే పిల్లలకు కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది.
జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఆస్తమా రావచ్చు.
వాయు కాలుష్యం, సిగరెట్ పొగ, సెంటు వాసనలు, దుమ్ము, ధూళి మూలానా కూడా ఈ వ్యాధి సంభవిస్తుంది.
యాస్పిరిన్ వంటి నొప్పి తగ్గించే ఔషధాలు, బీపీ నియంత్రణకు వాడే కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
అజీర్తి, గ్యాస్ ట్రబుల్, మానసిక ఒత్తిళ్లు మొదలైన వాటి వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది.
ఆస్తమా ట్రిగ్గర్లు
పుప్పొడి, దుమ్ము, పురుగులు, చాక్ పీస్ పౌడర్ , పెంపుడు జంతువుల చర్మం లేదా బొద్దింక వ్యర్థాల వంటి వి గాలిలో అలర్జీ కారకాలు,
సాధారణ జలుబు వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు,
శారీరక శ్రమ,
బలమైన భావోద్వేగాలు మరియు ఒత్తిడి,
రొయ్యలు, ఎండిన పండ్లు, ప్రాసెస్ చేసిన బంగాళదుంపలు, బీర్ మరియు వైన్‌తో సహా కొన్ని రకాల ఆహారాలు మరియు పానీయాలకు సల్ఫైట్లు మరియు ప్రిజర్వేటివ్‌లు జోడించబడ్డాయి. వీటి వలన కూడా ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటది.
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) అనేది కూడా ఆస్తమాకి ఒక కారణం.
నివారణ
ఉబ్బసం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు తీసుకోవలసిన మొదటి దశ ట్రిగ్గర్లను గుర్తించడం మరియు వాటిని నివారించడం.
తీసుకోవలసిన జాగ్రత్తలు :
చల్లని గాలిలో తిరగ కూడదు.
వర్షములో తడవకూడదు.
పడని పదార్దములు తినకూడదు .
మనసుని ప్రశాంతముగా ఉండనివ్వాలి.
రోగనిర్ధారణ విధానాలు:
స్పైరోమెట్రీ: ఇది వ్యక్తి ఊపిరితిత్తుల పనితీరును కొలవడానికి ఉపయోగపడుతుంది. అల్బుటెరోల్ వంటి బ్రోంకోడైలేటర్ తర్వాత ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడడం జరుగుతుంది, ఇది ఆస్తమాను నిర్ధారిస్తుంది.
ఆస్తమా పూర్తిగా నయం కాదా?
ఆస్తమా ఒక ఇన్ఫ్లమేటరీ జబ్బు. ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో ఒక్క సహజమైన రక్షణ గుణం. ఇది ఎక్కువ కావడం, తక్కువ కావడము ఉంటుంది. ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోవాలి కానీ ఆస్తమాకి క్యూర్ అనేది లేదు.
వస్తే ఇక తగ్గదా?
ఒకప్పుడు ఆస్తమా అంటే ప్రాణాంతకమే. కానీ ఇప్పుడు ఆస్తమాకు మంచి ఇన్హేలర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు.. శాశ్వతంగా, ముఖ్యంగా నాన్ అలర్జిక్ ఆస్తమా నుంచి విముక్తి కోసం సరికొత్త చికిత్సలు వచ్చాయి. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్లు తీవ్రమైన ఆస్తమా బారి నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
ఆస్తమా అంటువ్యాధా?
కాదు . రోగనిరోధక వ్యవస్థలోని గందరగోళ పరిస్థితి వల్ల వచ్చే అలర్జీ. అయితే దీనికి జన్యుపరమైన కారణాలున్నాయి. సాధారణంగా 95 శాతం సందర్భాలలో ‘ఫ్యామిలీ హిస్టరీ’ ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరికే ఆస్తమా ఉంటే, పిల్లలకు వచ్చే ఆస్కారం 25 శాతం. ఇద్దరికీ ఉంటే మాత్రం 50 శాతం మేర ప్రమాదం పొంచి ఉన్నట్టే. తొలిదశలోనే నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది.
చికిత్స
మందులు రెండు రకాలు:
ప్రివెంటర్లు: ప్రివెంటర్ పిల్లల గాలి గొట్టాలను ట్రిగ్గర్లకు తక్కువ సున్నితంగా ఉండేలా చేస్తుంది. ప్రతిరోజు అవసరాన్ని బట్టి నిరోధకాలను తీసుకోండి.
రిలీవర్,: రిలీవర్ను అవసరమైనప్పుడు ఉపయోగించాలి.
పిల్లల వయసు పెరిగే కొద్దీ ఆస్తమా తగ్గుతుందా??
ప్రతి ముగ్గురిలో ఇద్దరికి తగ్గే అవకాశము ఉంది. అయితే చిన్నతనంలో వచ్చే ఆస్తమా ఎటాక్‌లను నివారించడానికి, నయం చేయడానికి తగిన వైద్యం చేయించకుంటే పెద్ద అయిన తర్వాత కూడా ఈ సమస్య వెంటాడొచ్చు. కాబట్టి చిన్న వయసులో వచ్చే ఆస్తమాకు తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి.
యోగాతో ఆస్తమాకు తగ్గుతుందా ?
ఆస్తమాకు యోగా, ప్రాణాయామము మంచి వ్యాయామాలు. వృద్దులు, ఊబకాయం ఉన్నవాళ్లు, ఆస్తమా తొలి దశలో ఉన్న వ్యక్తులు బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. శ్వాసను లోతుగా తీసుకొని దాన్ని పట్టి ఉంచడం, తర్వాత నెమ్మదిగా వదలడం వంటి ట్రిక్స్ ఆస్తమా ఎటాక్‌ను కొంతవరకు తగ్గిస్తాయి.
ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా?
ఆస్తమాకు వ్యాక్సిన్ లేదు. కానీ ఫ్లూ వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఫ్లూ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ వాడితే కాస్త ఉపశమనం ఉంటుంది.
ఆస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారాలు-
ఆస్తమా వ్యాధి ఉన్న వారు ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకుంటే ఈ వ్యాధి వల్ల కలిగే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చు
పాలకూర: మెగ్నీషీయానికి పాలకూర మంచి ఆధారము. ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది.
రెడ్ క్యాప్సికం: దీనిలో “సి” విటమిన్ (ఎస్కార్బిక్ యాసిడ్) ఎక్కువగా ఉంటుంది. ఎర్ర మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ “ఫాస్ఫోడిల్ స్టెరేజ్” అనే ఎంజైమ్ ఉత్పత్తి ని అడ్డుకొని ఆస్తమాను నివారించడంలో ఉపయోగపడుతుంది.
ఉల్లి: వీటిలో కూడా యాంటీ – ఇన్ఫ్లమేటరీ, యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి.
ఆరెంజ్: కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్ ‘సి’ ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది.
యాపిల్: యాపిల్ లో ఉండే ‘ఫైటోకెమికల్స్’, యాపిల్ తొక్కలో ఉండే ‘లైకోఫిన్’ వంటివి అస్తమాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.
ప్రత్యామ్నాయ వైద్యంలో…
హోమియో, ఆయుర్వేదం లాంటి ప్రత్యామ్నాయ వైద్యాల ద్వారా ఆస్తమా నుంచి పరిపూర్ణ విముక్తి లభించదు. అల్లోపతి విధానంలో కూడా శాశ్వతంగా ఆస్తమాను పోగొట్టలేం. కానీ నియంత్రించవచ్చు. ఆస్తమాకు ఇచ్చే ఇంగ్లీషు మందులు సాధారణ జీవనశైలిని ప్రసాదించగలుగుతాయి. దీని విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఊపిరితిత్తుల్లో మార్పులు జరుగుతాయి. పదేపదే ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.
ఆస్తమా నివారణ
కింది అంశాలను అనుసరించడం ద్వారా ఆస్తమాను నివారించవచ్చు:
వాయు కాలుష్యం, చల్లని గాలి, సువాసనలు మొదలైన ఆస్తమా ట్రిగ్గర్లకు గురికాకుండా నివారించడం,
అలెర్జీ కారకాలతో సంబంధాన్ని నివారించడం,
సిగరెట్లు, కొవ్వొత్తులు, ధూపం మరియు బాణసంచా నుండి పొగను నివారించడం.
అనారోగ్య వ్యక్తుల నుండి దూరంగా ఉండటం (జలుబు లేదా ఫ్లూ)
పరిసరాలను ధూళి లేకుండా ఉంచాలి.
న్యుమోనియా, డిఫ్తీరియా, ధనుర్వాతం, బూస్స్టర్ వ్యాక్సిన్ మరియు కోరింత దగ్గును నివారించడానికి టీకాలు సకాలంలో తీసుకోవాలి.
ఆస్తమా మందులకు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
M.B.B.S, M.D Pediatrics Director – Jaya Vaaraahi Group of Hospitals.